నగరంలో వాన - కుందుర్తి ఆంజనేయులు


                                                                  
  నగరంలో వాన
కుందుర్తి ఆంజనేయులు

నగరంలో వాన

కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు

జల్లులు జల్లులై కురుస్తుంది

ఆశుకవితలో నగర ప్రజలకు

ఆశీస్సులు పలుకుతున్నట్లు

అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది

నగరంలో వాన

అంబరానికి అంతసంబర మెందుకంటే..

నున్నగా తెల్లగా తళతళలాడే

సిమెంట్ రోడ్ల అద్దాలలోకి

మింటి నుండి మెడలువంచి చూసి

తమ అందం చినుకుల కుప్పలుగా పోసి

అంతులేని ఆకాశమంత ఆనందంతో

మెలికలు తిరుగుతూ మిలా మిలా మెరుస్తాయి మేఘాలు

పక్షాలు పోయినా పాదాలు వచ్చి

పర్వతాలు పారాడుతున్నట్టు

పరుగెత్తే రెండంతస్తుల బస్సుల్ని చూసి

గిరి శిఖర భ్రాంతితో క్రిందికి దిగి వచ్చిన మేఘాలు

పైకి వెళ్ళడానికి బద్దకం వేసి కాబోలు

బహుకాల నగర దర్శన భాగ్య ప్రాప్తి చే కాబోలు

ఆ రాత్రికి సినిమా చూసి ఉదయమే వెళ్ళొచ్చని కాబోలు

అక్కడే నిలబడిపోతాయి హర్షం వర్షంగా కురిపిస్తూ

నడిబజారులో పడిపోయిన మూర్చవాడు

బిందెలతో దాహం తాగినట్లు

పగుళ్ళువారి నోరు తెరచుకున్న భూదేవికి

పల్లెల్లో పది దిక్కులైనా లెక్కుండదు

పల్లె సీమలో వానలమేనాల మీద

దివి నుండి సస్య సంవృద్ది దించే వర్షాకాంత

అవసరం లేనప్పుడడిగితే అప్పు సులువుగా లభించినట్లు

అక్కర్లేని నగరంలో కూడా పుష్కలం గా కురుస్తుంది

విసుక్కునే నగర ప్రజల వీపులు చిల్లులు పొడిచే

జల్లులతో వెక్కిరిస్తుంది సగం వచ్చి సగం రాక

స్వాగతం చెప్పని పట్నవాసాల సాగిన ఉదయపు జల్లు

రాత్రి వచ్చిన చుట్టాం లా తిష్ఠ వేస్తుంది తీరిగ్గా

***

నగరం లో కురిసే వానకు తెలుసు

గొడుగు జీతపు రూకల్లో మిగిల్చి

కొనగలగడం వట్టి మాటని

గోనెసంచి కప్పుకోవడం నాగరికులకు మోటని

తడిసి మోపెడై వణుకుతూ వచ్చి

వంటింట్లో కుంపటి ముందు కూర్చుని

మర్నాడు మంచమెక్కితే

తను చేసిన ఘన కార్యం కనులారా చూసుకుంటున్నట్లు

కిటికీలోంచి తొంగి చూస్తుంది చిటపటా చిలిపి జల్లుల్తో

నగరం లో కురిసే వానకు తెలుసు

ఆఫీసులు సరిగ్గా ఐదుగంటలకు వదులుతారని

ఉన్నవాడు ఉదయం తెరవ చూసి

ఉన్నిసూటు వేసుకున్నాడని

లేనివాడికి లేనేలేదని మర్నాటికి మరో జత

అంటదాక నిర్మేఘమైన ఆకాశం

ఆక్షణాన చిల్లిపడుతుంది

నగరం లో కురిసే వానకు తెలుసు

పలకాపుస్తకాలు నెత్తినపెట్టుకుని

పరుగెత్తె బడిపిల్లవాడు

కాలుజారి బురదలో పడినా కారు చక్రాల బురద చిమ్మినా

వాళ్ళమ్మ వాడ్నే అరుస్తుందని

తల్లి కొడుకుల చర్చ తనమీదకు మొగ్గకుండా

తీరా ఆ సమయానికి తెలేనట్లు వెలిసిపోతుంది

నగరం లో కురిసే వానకు తెలుసు

నాగేశ్వరరావు ఉదయమే లేచి

తీసుకుపోవలసినవన్నీ తీరిగ్గా గుర్తు తెచ్చుకుని

కొత్తగా కొనుక్కున్న గొడుగు వెంటపెట్టుకు వెళ్ళాడని

ఆ రోజు చినుకు చినుకదు

రాత్రి ఇంటికి చేరి వృధా శ్రమకు విచారిస్తుంటే

ఉరుములు ఫెళఫెళార్భాటులతో విరగబడి వికటాట్టహాసం చేస్తూ

నగరం నాలుగు మూలలా కుంభ వర్షం కురుస్తుంది.

ఇలా నగరం లో కురిసే వాన కేవలం గడుసరే కాదు

దానికి కాస్తో కూస్తో ధర్మం దయా ఉన్నాయి

మూడునాళ్ళ పసిపాపను

ముద్దుగా ఒడిలో గుండెలకద్దుకుంటూ

వెచ్చగా ఆసుపత్రి నుంచి పచ్చగా ఇంటికి వెళ్ళే

పచ్చి బాలింతరాలి మీద

పూలజల్లు పడుతుంది గాని

భోరున వర్షం కురవదు

ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందన సమయం లో

పండు పెడతారనో, చిరుతిండి పంచుతారనో

రెండుమూడు గంటల సేపు

బారులు తీరి నుంచున్న పసి బాలబాలికల మీద

జాలిగా సన్నని తుప్పర పడుతుంది గాని

జలజలా వర్షం కురవదు

***

నగరాల నాగరికత సులువుగా మరిగిన సూర్య దేవుడు

తెల్లవారి రేడియోలో తెలుగు వార్తల చివర

వాతావరణం వింటే గాని ఒక పళాన నిద్రలేవడు

భూమ్మిద పస్తులున్న మనుషుల్ని చూసి

ఆకాశం కంట తడిపెట్టినట్లు

వాన ముమ్మరంగా కురుస్తుంటే

ఉదయం నుండి సూర్య భగవానుడికి ఊపిరి సలపడం లేదు

రిక్షాలో కూర్చున్న ఘోషా సుందరిలా

ముఖానికి అడ్దం కట్టుకున్న మొయిలు ముసుగులు తొలగించి

ఎన్ని సార్లు చూశాడో లోకం వైపు

శతసహస్ర కిరణాల బాకులు ఝళిపించే

చాకచక్యం తగ్గింది

ప్రాణాలు తీసే ప్రతాపం- పాపం

శీతలానికి తల ఒగ్గింది

బ్రతుకులో సాధించదలచిన దానికి

పరిస్థితులు కలసిరాని మానవ మాత్రుడిలా

ఆ వేయి వెలుగుల దొర అగుపించడం లేదు

ఆయన రధం ఆగిందో నడుస్తుందో

ఆకాశానికే తెలియదు

ఉదయమే వేటాడడానికి ఉర్విమీద మంచులేదు

మధ్యాహ్నం మండించడానికి మబ్బుల కంచుకోట పగలదు

పగలనే పేరు సార్ధకమై పతి ఒల్లని భార్యలాగా

ముఖాన తిలకమైనా లేకుండా

ముడుచుక్కూచుంది దివసం

ఉద్యోగం ఊడిన కొత్తలో, భయంతో

కనబడిన వాడి కాళ్ళ మీదల్లా పడి

కాస్త సిఫార్సు చేయమని కోరినట్లు

ఏదో ఒక దేవుడ్ని ఆశ్రయించడానికి

వెళ్ళి ఉంటాడు రవి

పిల్లకాయలు తియ్యగా తినే పిప్పరమెంట్ బిళ్ళలా

ఏ మిట్ట మధ్యాహ్న సమయానికో

ఉన్నాననిపిస్తాడు; కనిపిస్తాడు కష్టం మీద

అన్నం ముట్టాని వ్రతం తో అంబరం వైపు

అడుగో ఇడుగో అని

ముక్కుతూ మూలుగుతూ చూసే ముసలమ్మల కోసం

మళ్ళీ సాయంత్రం అంతే..

మబ్బులతో నేసిన దుప్పట్లు

ఉన్నవాడు గనుక పుష్కలంగా

పడమటి కొండ పడగ్గదిలోకి

మూడింటికే చేరి ముసుగు కప్పు కుంటాడు

నగరాల నాగరికత

నాలుగు కాండలు వెళ్ళ జదివిన

సూర్యుడు సోమరిగా తిరుగుతుంటే

పులిగా ముప్పూట ప్రతాపించి

చలి ఎముకలు కొరికేస్తుంది

***


వానకురిసే సమయం కోసం వారం పదిరోజులు వేచి

పరస్పరం సమాంతరంగా వర్షాదిలో భూమికి దిగిన

ముత్యాలవంటి రెండు చినుకులు

మిలమిలా మెరుస్తూ జలజలా జారుతూ

వచ్చిన దారిని నిచ్చెన చేసి

ఉవ్వెత్తుగా లేచిన ఊహతో మెల్లగా మెట్లెక్కిపోయి

మేఘావృత గగనం లోంచి మేదిని వైపు చూతును గదా-

నగరం గడగడ ఒణికిపోతున్నది

నగరం నడి సముద్రంలో తేలాడుతున్న ద్వీపం లా ఉంది

ఉడువీధి నుండి జారిన ఒక మంచుకొండ ఏదో పగిలి

శతకోటి శకలాలు జలబిందువులుగా మారి

ముసురుగా ముంచెత్తుతుంటే

గూట్లోకి చేరిన గువ్వలా నగరం నక్కి కూచుంది

ఆకాశపు పెండ్లి కొడుకు అనేక శతాబ్దాల క్రితమే

నగరకాంటకు మెళ్ళో కట్టిన తగరపు తాళిబొట్టులా

తళతళా మెరుస్తుంది హుస్సేన్ సాగర్ చెరువు

కదుల్తున్నాయి కార్లు బాలవీరులు విసిరిన కత్తిపడవల్లా

ఎర్రరాయి చెక్కిన ముక్కుపుడకలాంటి

విద్యుద్దీపం విరజిమ్మే కాంతిలో

పావురంలా ఎగురుతోంది టపామోసుకొస్తున్న విమానం

రంగురంగు దుస్తుల్లో రబ్బరు బొమ్మల్లా

అక్కడొకడు ఇక్కదికడు మనిషి

కదిలినట్టే కనపడ్డది గాని

అంతా స్థంభించిపోయింది; అరగంట సేపు నిశ్సబ్దం

ఆకాశరాజు చేసిన దాడికి నగరం నలిగిపోయింది

రైళ్ళు కూయడం లేదు

ఆఫీసుల్లో ఫైళ్ళు రాయడం మానుకున్నాయి

వారాంటపు సెలవుల చట్టం ఉల్లంఘించిన కిరాణా వర్తకుడు

సగం తెరచిపెట్టిన తలుపు పూర్తిగా మూసేసుకున్నాడు

సిమెంటు గొడుగు చిల్లిగవ్వకు కొరగాక

మామూలు ఎగేసి తనకే నామాలు పెట్టిన పక్క అంగట్లో

తలదాచుకున్నాడు ట్రాఫిక్ పోలీసు

సరిగ్గా పావలా దూరాన్ని సవారూపాయికి పెంచమంటూ

వర్షాధి దేవతను రిక్షావాండ్లు

వరాలు కోరుకుంటున్నారు

సైకిలుకి కట్టిన బిందెమీద

గుడ్డమూత పూర్తిగా తీసేసి

వణుక్కుంటూ పాలవాడు వరండాలో నుంచున్నాడు

మీటనొక్కి యింట్లో లైట్లు చూసుకుని

మూలబడిన బెడ్ లైట్ భాగాలను

బాగుచేసుకుంటున్నారు గృహిణులు

తెల్లవారితే మడిబట్టలారవని

దిగుల్తో పడుకుంది ముసలమ్మ

నడియౌవనబలంతో వానలో తడుస్తూ పోయి ఫర్లాంగుదూరం

చటాకు చేమంతి పూలు తెచ్చాడు

కొత్తగా పెళ్ళి చేసుకున్న గృహస్తు

మర్నాడు కాలేజికి సెలవు ఇవ్వకపోతే

సమ్మె చెయ్యాలని శపధం పట్టాడు

చదువుకుంటున్న కుర్రాడు

చీకు చింతా లేకుండా అమ్మా నాయనా వద్దంటున్నా

వానా వల్లప్పలాడుతూ

పరుగులు తీస్తున్నారు పసివాండ్లు

అంతా స్థంభించిపోయిందనుకున్నాను

అరగంటలో అనంతకోటి దృశ్యాలు

***

అప్పుడు దిగివచ్చిందూహ నేలమీద నేనేమి చేస్తున్నానో అని

నేలమీద నేనేమి చూస్తున్నానంటే-

సాయంత్రపు షికారుకై మూడు గంటలు మస్తాబై

దవనం బేరమాడుతూ నుంచున్న జవరాలు జడలో ముడిచిన

గులాబీ పూవులోబడి రేకలమీద ప్రాకుతూ

వర్షాంతంలో భూమికి దిగిన ఒకానొక ముసలి జలబిందువు

కులికింది కోటి జన్మాల కోరిక నెరవేరినట్లు

అందాక దానితో కలిసే వచ్చి అరంగుళం పక్కగా బడి

భూగర్భపు మురికి కూపంలోకి పోయిందొక జలబిందువు

ఎత్తైన విద్యుద్దీపం మీదకి ఎక్కి నిక్కి చూచిందొక చినుకు

చెట్టు క్రింద చీకట్లోపడి దారి తెన్ను తెలీక

చిందులు త్రొక్కిందొక చినుకు

ఆవులిస్తున్న నవనాగరికుడి

అధరోష్ఠం మీద వ్రాలిన చినుకు

మధువు వాసన వేసి కాబోలు

మైమరచి తైతక్కలాడింది

కిటికీలోని మందుసీసాలో పడిన చినుకు

చేదెక్కి శరీరమంతా

ఏ కమ్మని పల్లెటూరి పంటచేలోనో పడక

నగరానికెందుకొచ్చానని నాలుక కొరుక్కుంది

చదువుల తల్లి స్తన్యమంత మధురమైన మరొక బిందువు

విశ్వవిద్యాలయావరణంలో

వెలిగిన వెలుగులో కలిసిపోయింది

చార్ మీనార్ గోపురాగ్రం మీదపడి నిలచిన చినుకు

ఎత్తయిన సింహాసనం మీద కాలేసి మీసం మెలేసుకుంటూ

నగరం నాలుగు మూలలూ సగర్వం గా చూసింది

చీటికీ మాటికి కోర్టుకెక్కడం చీదరెత్తింది కాబోలు

హైకోర్టు భవనమ్ మీద చింతతో చిందిన చినుకు

పక్కనే ఉన్న మూసీలో పడి ముక్కు మూసుకుంది

శాసన సభాశిఖరం మీద చల్లగా జారిన బిందువు

ఆకసం వంక తలయెత్తి చూసి

చాలిక వర్షమని శాసించింది

అంతటితో వాన వెలసింది

అదీ నగరంలో వాన

నాకు తెలిసిన నగరం లో వాన

అంటే హైదరాబాద్ లో వాన.

డిగ్రీలో నేను చదువుకున్న పాఠ్యాంశం, మూలం కుందుర్తి కృతులు.



కవి పరిచయం

       1922 డిసెంబర్ 16వ తేదిన గుంటూరు జిల్లాలోని వినుకొండకి సమీపాన ఉన్న కోటవారిపాళెం పల్లెటూరిలో కుందుర్తి ఆంజనేయులు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో జాషువా కవి యొక్క శిష్యులు కుందుర్తి. ఆ తరువాత 1936-41 వరకు విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1937లో పద్యరచనకి శ్రీకారం చుట్టారు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా కుందుర్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు. ఆయన ప్రభావంతో ప్రాచీన కవిత్వ పఠనం అలవడింది. పద్య కావ్యాలు, ప్రేమ కావ్యాలు రచించారు. 1941-43లో గుంటూరు ఏ.సి.కాలేజిలో బి.ఎ. చదివారు. ఈయన సామ్యవాద, కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షింపబడ్డారు. 1944 నాటి నయాగరా కవులలో ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. 1977లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన 1982 అక్టొబరు 25న మరణించారు.

కుందుర్తి రచనలు    

    “పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అని ధైర్యంగా ఎలుగెత్తి తన ఆధునిక వచన కవిత్వాని సామాన్యులకు కూడా అర్థమయే విధంగా వచన కవిత్వాన్ని రచించి కొనసాగించాడు. అమావాస్య నా ప్రేయసి, నయాగరా, తెలంగాణా, ఆశ, నగరంలో వాన, నాలోని నాదాలు, హంస ఎగిరిపోయింది, మేఘమాల ఇది నా జెండా మొదలగునవి వచన కవిత్వంలో నాటక రచనలో ప్రయోగాలు చేశారు. హైదరబాద్ లో ఫ్రివర్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు. ఆ కారణంగా వచనకవితా పితామహులు. కుందుర్తి కృతులు పేరిట వీరి సమగ్ర కవిత్వ సంపుటం చాలకాలం క్రిందటే వెలువడింది. 1969లో సోవియట్ లాండ్ నేహ్రూ అవార్డు, 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వంటి ప్రముఖ పురస్కారాలు పోందారు. ఈయన ఉద్యమ దీక్షతో, వచనంలో కవిత్వ రచన చేసిన కవి. భావసరళత, భాషా సరళత, లక్ష్య స్పష్టత గాఢంగా కోరారు. సమకాలీనత కావాలని పట్టుపట్టారు. ఆత్మశ్రయ ఖండకృతిలో పునరుక్తులకు అవకాశమెక్కువని నమ్మి, వచన కవిత్వ ప్రక్రియలో పెద్ద కావ్యాలు రచన చేయలని వాదించారు. తాను మంచి భావకుడైనా, కవిత్వంలో లక్ష్యశుద్ధికే మొదటి తాంబూలమిచ్చారు. ప్రాచీన కవులలో శతకకారులకుండే నిసర్గ భావ వ్యక్తీకరణ విధానంతో ఈయన భావ ప్రకటన విధానాన్ని పోల్చవచ్చు అని విమర్శకులు పేర్కోన్నారు.

         పేద మధ్య తరగతి ప్రజల జీవనచిత్రాల్ని తన కవితలలో కుందుర్తి ఆంజనేయులు ప్రతిబింబింపజేశారు. మరి మనం ప్రస్తుతం చదువుతున్న పై కవిత నగరంలో వాన- భాగ్యనగరంలో వర్షం కురిసినప్పుడు తడిచి ముద్దయిన ప్రజల జీవన గతులన్ని ఆనందహేళలను చిత్రించిన అద్భుత అక్షర దీప కవితా రచన ఆవిష్కారము నగరంలో వాన కవి కుందుర్తి ఆంజనేయులు ఊహాంచలాల్లో కదిలి తడిసిన కమనీయమైన భావనలు నగరంలో వాన కవితగా రూపుదిద్దుకున్నాయి. ఆశు కవితలో నగర ప్రజలకు ఆశిస్సులు పలుకుతున్నట్లుగా హైదరాబాదులో వాన కురుస్తుంది. పరుగెత్తె రెండంతస్థుల బస్సులు రెక్కలు పోయిన పాదాలతో పరుగెత్తె పర్వతాల వలె ఉన్నాయని ఆయన పోల్చారు.

 చాలకాలం తరువాత నగరానికి వచ్చిన మేఘాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి. ఆ రాత్రి వాన చాలా దట్టంగా కురిసింది. పల్లెల్లో పొలాలకి వర్షం అవసరం అక్కడ ఎంత వర్షం కురిసిన ఇబ్బంది అంతగా ఉండదు. కాని నగరంలో వాన ప్రజల్ని అన్ని విధాలుగా బాధ పెడుతుంది.

   నడిబజారులో పడిపోయిన మూర్చవాడు

   బిందెలతో దాహం త్రాగినట్లు

   పరుగుళ్ళువారి నోరు తెరుచుక్కుచ్చున్న భూదేవికి

   పల్లెల్లో పది దిక్కులైనా లెక్కుండదు.  

ఇక్కడ మూర్చవాడు, పల్లెప్రజలు, అప్పుతీసుకునేవాడు అనే ఈ పదాలను ఉపయోగించడం వలన ఆయన మధ్యతరగతి వారి కష్టాల్ని, ఇబ్బందుల్ని కుందుర్తి వినూత్నంగా సాహిత్య సమాజానికి పరిచయం చేస్తున్నాడు. జీతపు రూకల్లో మిగిల్చి గొడుగుకొన్నాడు సామాన్యుడు, ఎందుకంటే గొనెసంచీ కప్పుకుంటే నగరంలో మోటుగా ఉంటుందని, కాని ఆ రోజు గొడుగు తీసుకొని పోకపోవడంతో తడిసి మోపడై, వణుకుతూ, వంటింట్లో కుంపటి ముందు కూర్చొని, మంచం ఎక్కిన పేదవాని పరిస్థితి చూసి వర్షం  వానితో చిలిపిగా ఆటలాడుతోంది.

వర్షం – తెలివి

   వర్షం చాలా తెలివైనది. ఆఫీసు 5 గంటలకు వదులుతారు. ఉదయం ఆకాశం వైపు చూసి ఉన్నవాడు ఉన్నిసూటు వేసుకుని వచ్చాడు. అప్పటిదాకా మేఘాలు లేని ఆకాశం, వర్షం ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురుస్తుంది. వర్షం చాలా చిలిపిది పలకా పుస్తకాలు నెత్తిన పెట్టుకుని పరుగెత్తే బడి పిల్లవాడు కాలుజారి బురదలో పడినా, లేదా కారు చక్రాలు మురికి చిమ్మినా వాళ్ళ అమ్మవాణ్ణే అరుస్తుందని అనుకున్న తీరా వారి సమస్య  తెరుస్తుంది. ఎవరు ఏమీ అనరు. నాగేశ్వరరావు ఉదయమే లేచి తీసుకుపోవలసివన్నీ తీరిగ్గా గుర్తుకు తెచ్చుకుని కొత్తగా కొనుకున్న గొడుగు కూడా తన వేంట తీసుకు వేళ్ళాడు కాని ఆరోజు చినుకు కూడా పడలేదు. రాత్రి ఇంటికి చేరి వృధాగా గొడుగు తీసుకెళ్ళా అని అనుకుంటే తరువాత రోజున  అప్పుడు కురుస్తుంది వాన  ఈ విధంగా కవి అనేక ఉదాహరణలిస్తూ వర్షానికి తెలివి ఉందని చాటారు.

 

ఇలా నగరం లో కురిసే వాన కేవలం గడుసరే కాదు

దానికి కాస్తో కూస్తో ధర్మం దయా ఉన్నాయి

మూడునాళ్ళ పసిపాపను

ముద్దుగా ఒడిలో గుండెలకద్దుకుంటూ

వెచ్చగా ఆసుపత్రి నుంచి పచ్చగా ఇంటికి వెళ్ళే

పచ్చి బాలింతరాలి మీద

పూలజల్లు పడుతుంది గాని

భోరున వర్షం కురవదు

ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందన సమయం లో

పండు పెడతారనో, చిరుతిండి పంచుతారనో

రెండుమూడు గంటల సేపు

బారులు తీరి నుంచున్న పసి బాలబాలికల మీద

జాలిగా సన్నని తుప్పర పడుతుంది గాని

జలజలా వర్షం కురవదు.

వర్షం –జాలి  వర్షానికి ధర్మం, జాలి కూడా ఉన్నాయి. అని కవి అంటున్నారు. ఈపై ఉదాహరణలు పేర్కోన్నారు. ఆసుపత్రి నుండి ఇంటికి వేళ్ళే పచ్చి బాలింతరాలు మీదా పూలజల్లు లాంటి వర్షపు చినుకులు పడతాయిగాని జడివాన కురువదు. ఆగస్టు 15 తేదిన బారులు తీరిన బాలబాలికల మీదా జాలిగా సన్నని తుపర పడుతుంది కాని కుంభ వర్షం కురువదు. ఈ విధంగా వాన కూడా జాలిని దయను చూపిస్తుంది.

 ముగింపు-  ఒక కావ్యాన్ని, కవిని అంచనా వేయడానికి ఆ కాలానికి సంబంధించిన ప్రమాణాలనే పరిగణనలోకి తీసుకోవాలి.అనంతర వాటితో జోడించి బేరీజు వేస్తే అది సరైన విశ్లేషణ కాబోదు. ఈ రీత్యా కుందుర్తి నగరంలో వాన కావ్యం అప్పటికే 1967లోనే కుందుర్తి ఎంత నవీనుడో తెల్పుతుంది. కుందుర్తి అన్ని కావ్యాల్లోలాగే ఇందులోని కవితా ఖండికలూ సరళత, స్పష్ట, సహజతలకు చిహ్నలు, మచ్చుకు ఈ కావ్యనామం అయిన కవితా శీర్షికనే తీసుకుందాము. నగరంలో వాన అనగానే మన ముందో దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రాకృతిక సంబంధిత వాన, ఆధునిక మరియు సంక్లిష్టతల మేళవింపు నగరం రెండింటి అద్వితీయ సమ్మేళనంతో పాఠకుడిని నగరం మధ్య నిలబెట్టి అక్షరాల వానతో పూర్తిగా తడిపిస్తారు. ఇక్కడ కవి సున్నిత, సునిశిత పరిశీలన దృష్టిని దర్శింపచేస్తుంది. అని బి. లలితానంద్ గారు వివరించారు.(శతవసంత సాహితీ మంజీరాలు-(వంద పుస్తకాలపై విశ్లేషణ) సంపాదకులు- ప్రయాగ వేదవతి –స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విజయవాడ. నాగసూరి వేణుగోపాల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి అనంతపురం. (ముద్రణ -ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ భవనం,విజయవాడ-520010 డిసెంబర్-2002) పుట-87)

          -పోల బాలగణేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,   కాశీ హిందూ విశ్వవిద్యాలయం

వారణాసి-221005. 

                                                             


          ----------------------000--------------------------    


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ