నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు
నీతి శతకాలు – మానవ జీవితాలకు ఆదర్శప్రాయాలు
పోల బాలగణేశ్,
పరిశోధక విద్యార్థి,
తెలుగు విభాగం,
కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి-221005.
నైతిక జీవితానికి వన్నె చేకుర్చేవి నీతి
శతకాలు. సంస్కృత కావ్య శాస్త్రం పేర్కొన్న ముక్తక ప్రక్రియ భారతీయ భాషలతో పాటు తెలుగు సాహిత్యంలో శతక రచనగా చెప్పవచ్చు.
సంస్కృత సాహిత్యంలోను శతక రచనలు ఉన్నా,
అవి తెలుగు సాహిత్యంలోని శతకాలు కన్న తక్కువ ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. శతకం
అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పద్యాల సంఖ్య అది 108 లేదా 116. ఈ నూట
ఎనిమిది పద్యాలు దైవ స్ర్తోత్రాల్లో, అష్టోత్తర శతనామాలు వంటి ఆధ్యాత్మిక
స్ర్తోత్రాల ప్రభావంగా ఈ శతక పద్య సంఖ్య స్థిరపడింది. కొన్ని 105, కొన్ని 100 కన్న
తక్కువ ఉంటే, మరి కొన్ని వందకు పైగా ద్విశతి, త్రిశతి, పంచవింశతి వంటివి కూడా
ఉన్నాయి. 12వ శతాబ్దం నుండి శతక సాహిత్యం ప్రారంభమైనది. అది కూడా వృషాధిప శతకంతో ఆరంభమైది. నిర్థిష్ట శతక
నియమాలు, లక్షణాలైన పద్య సంఖ్య, మకుటం, ఏక రసాత్మకం, ఏక ఛందస్సు వంటివి. అయితే
కొంత మంది సాహిత్య చరిత్రకారులు శతక ప్రక్రియ బీజాలు ఆది కవి నన్నయ రచించిన ఆంధ్ర
మహా భారతంలోని ఉందకుడు వాసుకిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన స్ర్తోత్రంలో వరుసగా
4 పద్యాలు వ్రాసారని
పేర్కొంటారు. ఇదే మౌలికమైన భావనగా తీసుకొన్ని శతక సాహిత్యం విస్తరించిందని చెప్పవచ్చు. సంస్కృతంలో భక్తృహరి శతకం చాల ప్రసిద్ధం. ఆయన
నీతి, శృంగార, భక్తి శతకాలు రాశారు. శతక
సాహిత్యంలో వస్తు వైవిధ్యం సంతరించుకొంది. ప్రధానంగా నీతి, భక్తి, వైరాగ్య, శృంగార
శతకాలు ఉన్నాయి.
శతక
రచన సాధారణంగా కవులు కావ్య రచన ఆరంభంలో దైవ ప్రార్థనగా, దైవ స్మరణగా, పద్య రచన
సాధనంగా వ్రాసేవారని ఆవిధంగా వచ్చినవే భక్తి శతకాలుగా ప్రాచుర్యం పోందిన్నాయని
సాహిత్య పరిశోధకులు తెలిపారు. తెలుగు సాహిత్యంలో శతక రచన తెలుగు సాహిత్య
వికాసంతోపాటే కొనసాగింది. ఇతిహాస కావ్యం, మహా కావ్యం, ప్రబంధం ఇలా ప్రముఖ ప్రక్రియలు
విస్తరింస్తున్నప్పటికి శతక రచన సాగుతూనే ఉంది. నేటికి శతక రచనలు
ఆవిష్కరింస్తున్నారు కవులు.
శతకం ప్రధానంగా నేటి కాలంలో
పాఠక లోకానికి అత్యంత అవసరం. నేడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి తరగతిలో
పాఠ్యాంశంగా శతక పద్యాలున్నాయి. దీనితో శతక ప్రక్రియ ప్రాధాన్యం ఏమిటో పాఠ్య నిర్ణయక
సంఘం గుర్తించింది. మరి ఎంత మంది ఈ జ్ఞానంతో వ్యవహారిస్తున్నారో సమకాలీన ఆచార్యుల
శైలి నిరూపిస్తుంది. పాఠకునిలో మొదట
వారికి పట్టుబడవలసింది పద సంపద. దానితో పాటు ఆ పదాల అర్థం, దానితో పాటు సులభ
సాధ్యంగా గ్రహించే భావనలు వారి హృదయ, మస్తిష్కాలకు హత్తుకోవాలి నిక్షిప్తం కావాలి.
వారి ఎదుగుదలకు అవి తోడ్పాలి. చెప్పడానికి శ్రీరంగ నీతులు అన్నట్లు తయారు చేయడం
కాదు. సాంస్కృతీక, సామాజిక ప్రభావాలు ఈ శతక పద్యాల ద్వారా పాఠకుల దృష్టికి
తీసుకోన్ని రావడం మంచిదే అయినప్పటికి నేడు బోధకులు ఈ సంస్కృతి పేరుతో, సామాజిక
చైతన్యం పేరుతో పాఠకుల్లో అడ్డుగోడల నిర్మాణానికి పునాదులు తీస్తున్నారు. మానవుని
జీవితంలో మతం, సామాజిక అంశాల ప్రాధాన్యం పెరిగిపోయి, నైతిక విలువలు కూడా మరుగున
పడుతూన్నాయి. ఇంటు వంటి సమయంలో శతక సాహిత్యం పై చర్చ గోష్టి మానవలోకానికి
మేలుకోలుపును, ఉత్తమ నైతిక ప్రవర్తన వైపు నడిపించ గలదు.
నీతి
అంటే:- న్యాయము, ఉపాయము, సత్ర్పవర్తనము, విధము, రీతి
అనే అర్థాలను నిఘంటువు తెల్పుతుంది. మానవుడు తన జీవితంలో ఏలా ప్రవర్తించాలో అని
ఆలోచించి సానుకుల దృక్పథంతో నడుచుకుంటూ ఇంటిలో, సమాజంలో, విధి నిర్వహనలో సవ్యంగా
నడుచుకోవడం. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడం విచక్షణ జ్ఞానంతో మేలగడం. నైతిక ప్రవర్తన
విధానం, సత్ర్పవర్తన పాటించడం. నీతి అంటే లోక వ్యవహారంలో మంచి అని అర్థం ఉంది.
మానవ జీవితాని సన్మార్గంలో నడిపించడానికి ఈ నీతి శతకాలు రచింపబడ్డాయి. తనకు ఇతరులు
ఏమి చేస్తే బాధ పడుతారో తాను కూడా ఇతరులకు అవి చేయకుండా ఉండటమే లోక ధర్మంగా చెప్పవచ్చు.
ఆచరణాత్మకమైన విధి విధానాలు నీతి లో
భాగంగా చెప్పవచ్చు.
మానవుడు తన నడవడికను బాల్యంలోనే నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల వారి సామాజిక,
మానసిక ప్రవృత్తుల సారం గ్రహిస్తుంటారు పిల్లలు. సమాజంలో వారి జీవనం ఎలా ఉండాలో
తెలుసుకొనే మార్గం నీతిశతక పఠనం ద్వార సాద్యమైతుంది. మానవుడు ప్రధానంగా తాను విద్య
వినయ గుణ సంపన్నుడు కావడానికి ఈ శతకాలే మూల కారణం అంటే అతిశయోక్తి కాదు. ప్రతి
కుటుంబం కూడా తమ పిల్లలకు ఉత్తమ సుగుణాలు అబ్బలనే ఆశిస్తారు. అటువంటి సందర్భంలో
నీతి శతకాలు ప్రాధాన్యం వహిస్తాయి. మానవుడు తన కుటుంబంతో, తన తోటి వారితో, సమాజంతో
ఏ విధంగా మెలగాలో ఈ శతకాలు ప్రధానంగా బోధిస్తాయి. ఇవి నిత్య పారయణ గ్రంథాలు ఎందుకంటే మానవుని ఆలోచనలు ఎప్పుడు స్వార్థం
చూట్టునే తిరుగుతుంటాయి. కాబట్టి కొంచం వాటిని ప్రక్కన పెట్టి నీతికి నిలబడితే ఆ
వ్యక్తి కీర్తిని శిఖరం పై చేరుస్తాయి ఈ శతకాలు. ఆదర్శజీవితానికి పాదులు తీస్తాయి.
అటువంటి నీతి శతకాలు వరుసగా కొన్ని గమనిద్దాము.
నీతిశతకాలు సమాజంలోని వివిధ వ్యక్తుల ప్రవృత్తులకు
సంబంధించి ఉంటుంది. ఇవి పూర్వ గ్రంథాలను, లోకానుభవాలను ఆధారం చేసుకొని
రచింపబడతాయి. ప్రధానంగా 1. రాజనీతి, 2. గృహ నీతి, 3. లోక నీతి, 4. ప్రవృత్తి నీతి
వంటివి ముఖ్యమైనవి.
I. సుమతీ శతకం:- కాలం మరియు గుణ విశేషాలను ప్రాధాన్యంతో
నీతి శతకాలో ప్రముఖమైనది సుమతీ శతకం. ఈ శతకంలోని పద్యాలన్ని కంద పద్యాలు. 13వ శతాబ్దం చేందిన
బద్దెన అనే భద్ర భూపాలుడు ఈ శతకం రచన చేశారు. ఈ కవి నాటి సమకాలీన రాజకీయ
పరిస్థితులు, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకోని ఈ రచన చేశారు. గ్రామీణ జీవన
విధానం, ఆనాటి ప్రజల మనస్తత్వం ఈ పద్యాలో
కనబరచారు.
కం. శ్రీరాముని దయ చేతను
నారూఢిగ
సకల జనులు, నౌరాయనగా
ధారాళమైన
నీతులు
నోరూరఁగ
జవులు వుట్ట, నుడివెద సుమతీ.
భావం- మంచి బుద్ధి కలదానా వాడా శ్రీరామచంద్రుని
దయతో లోకంలోని ప్రజలందరూ ఆశ్చర్యంతో మేచ్చుకొనేట్లుగా ఇష్టమైన పదార్థాలు
చూసినప్పుడు తినాలనే కోరికతో నోట నీరు ఊరినట్లుగా ఇంకా వినాలనే కుతూహలం కలిగిస్తూ ధారాళంగా నీతివాక్యలను అందంగా చెబుతాను.
1. రాజనీతి-
కం.
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దోరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతీ
సుమతీ బాగా పని
చేయించుకుని జీతంమాత్రం అడిగిన కూడా ఇవ్వని గర్వి అయిన ప్రభువు వద్ద పని చేసి
బాధలు పడటం కంటే, వేగంగా పని చేయగల ఎద్దులను కట్టుకొని దున్నకుంటూ ఈ భూమిమీదా
బ్రతకటం మంచిది.
ఎప్పటి
కెయ్యది ప్రస్తుత
మప్పటిక కా
మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా
నొవ్వక
తప్పించుక
తిరుగువాడు ధన్యుడు సుమతీ
ఓ సుమతీ ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఆ సమయానికి అవే మాట్లాడి
ఎదుటివారిని బాధపెట్టకుండా, తానూ బాధపడకుండా తప్పించుకుని తిరిగేవాడే ఈ లోకంలో
ధన్యజీవి అవుతాడు.
కం. ఉపకారి నుపకారము
విపరీతము గాదు
సేయ వివరింపంగా
నపకారికి
నుపకారము
నెపమొన్నక
సేయువాడే నేర్పరి సుమతీ
2.
గృహనీతి –
కూరిమిగల
దినములలో
నేరము లెన్నండును గలుఁగ నేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ
సుమతీ వ్యక్తుల మధ్య
స్నేహం బాగా ఉన్న రోజుల్లో ( స్నేహతులుగా ఉన్నప్పుడు ) ఎన్ని తప్పులు
జరిపినా అవి తప్పులుగా కనిపించవు. అదే స్నేహం చెడి విరోధులుగా మారినప్పుడు మంచి
పనులు కూడా నేరాలుగానే కనిపిస్తాయి. ఇది సత్యం. ఇది మానవనైజం.
కం. తన కోపమె తన
శత్రువు
తన శాంతమె
తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె
స్వర్గము
తన దుఃఖమె
నరక మండ్రు తథ్యము సుమతీ
సుమతీ తన కోపమే తన శత్రువు అవుతుంది. తన శాంతమే తనను
రక్షిస్తుంది. తన దయాగుణమే తనకు బంధువుగా ఉంటుంది. తన సంతోషమే తనకు స్వర్గసుఖాలను ఇస్తుంది. తన దుఃఖమే తనకు నరక
బాధలను కలిగిస్తుంది. కోపం అన్ని అనర్థాలకు మూలమైంది. ఇది నిజం.
కం. కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి
తప్పు ఘటియింపకుమీ
కలకంఠి గంట
కన్నీ
రొలికిన సిరి
యింట నుండ నొల్లదు సుమతీ
ఓ సుమతీ ఇంటికి దీపం ఇల్లాలు. అటువంటి ఇల్లాలితో (భార్య)
ఎప్పుడూ గొడవ పడరాదు. కేవలం తప్పులే ఎత్తిచూపుతూ బాధ పెట్టరాదు. ఏ ఇంట ఇల్లాలు
కన్నీరు కారుస్తుందో, ఆ ఇంట్లో సిరిసంపదలు కోల్పోయి దరిద్రులు అవుతారు.
లోక నీతి-
కం. వినఁదగు
నెవ్వరు చెప్పిన
వినినంతనె
వేగపడక వివరింపదగున్
కని కల్ల
నిజముఁ దెలిసిన
మనుజుఁడే
పో నీతిపరుడు మహిలో సుమతీ
సుమతీ ఈ భూమి పై ఎవరేమీ చెప్పినా ముందు వినడం నేర్చుకోవాలి.
విన్నవెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా బాగా ఆలోచించాలి. అలా బాగా ఆలోచించడం
వల్ల నిజానిజాలు బయట పడతాయి. అలా తెలుసుకోగలిగినవాడే నీతిమంతుడనబడతాడు.
కం. లావుగలవాని కంటేను
భావింపఁగ
నీతిపరుఁడ బలవంతుడౌ
గ్రావంబంత
గజంబును
మావటి
వాడెక్కినట్లు మహిలో సుమతీ
సుమతీ ఈ లోకంలో శారీరక బలం ఉన్నవాన్నికన్న, బుద్ధిబలం
ఉండేవాడు (నీతిగా ఉండేవాడు)బలవంతుడుగా భావించబడుతాడు. అదేలాగంటే బుద్ధిబలం ఉన్న
మావటివాడు పర్వతమంత ఎత్తైన ఏనుగును తను చెప్పినట్లుగా నడిపిస్తాడు కదా. భుజబలం
కన్న బుద్ధిబలం గొప్పది.
కం. మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ
బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ
బ్రాణము మానము
చీటికిఁ
బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
సుమతీ ఈ భూమిపై నోటిమాటకు సత్యమే ప్రాణం. గొప్ప సేనాసమూహమే
కోటకు ప్రాణం. స్త్రీలకు అభిమానమే ప్రాణం. వ్రాతపత్రాలకు చేతి సంతకమే ప్రాణం. ఇది
నిజం.
కం. బలవంతుఁడ నాకేమని
పలువురితో
నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన
సర్పము
చలిచీమలచేతఁ
జిక్కి చావదే సుమతీ
సుమతీ నేను బలవంతుడిని. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని గర్వంతో విర్రవీగుతూ అందరితో విరోధం తెచ్చుకోరాదు. బలవంతమైన పాము కూడా బలహీనమైన చలిచీమల చేతికి చిక్కి చావడం లేదా.
II. వేంకటేశ్వర శతకాని:- తాళ్ళపాక పెద్దతిరుమలాచార్యుడు 16 శతాబ్దం పూర్వార్థం రచించారు. శతకంలోని పద్యాలన్ని సీస పద్యాలు. భక్తి ప్రధానమైన శతకమైనప్పటికి సందర్భానుసారం ఇందులో లోకనీతి, రాజనీతిని కూడా వివరించారు. ఈ శతకం సరళ సుందరమైన శైలితో ఉండి భావి నీతిశతక కవులకు మార్గదర్శకమైంది. కలితలక్ష్మీశ, సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకశ వేంకటేశ అనే మకుటంతో ఈ శతకం రచింపబడింది. దీనిలో వంద పద్యాలున్నాయి. నీతిని బోధించే మొట్టమొదటి సీసపద్య శతకంగా పరిశీలకులు పేర్కోన్నారు. జాను తెలుగు పదాల కుర్పుతో చక్కని భావార్థాలను, భావానుగుణంగా పదాల విరుపులతో ఈ శతకం రచింపబడింది. అక్కడక్కడ లోకోక్తులు, జాతీయాలు ఈ శతకంలో కవి ప్రయోగించారు.
ధర్మంబు
గల చోటఁ దలకొను జయమెల్ల,
దయగలచో సుకృతంబు నిలుచు
సత్యంబుగల చోట సమకూరు శుభములు,
నేమంబుగల చోట నిలుచు సిరులు
పాడిగల చోటఁ బంతంబులీడేఱు,
దాక్షిణ్యమున్నచోఁ దగులుమైత్రి
భక్తిచేసినచోట ఫలమిచ్చుదైవంబు,
మనసు నిల్పిన చోట మలయు సుఖము
లితరమగుచోట వెదికిన నేలయుండు,
సొరిదినీ దైన కృపగల చోటఁగాక
కలితలక్ష్మీశ, సర్వజగన్నివేశ,
విమల రవికోటి సంకశ వేంకటేశ
ధర్మం
ఉన్న చోట జయం ఉంటుంది. దయ ఉన్న చోట మంచి కార్యాలుంటాయి. సత్యం ఉన్నచోట సకల శుభాలు
కలుగుతాయి. నియమున్నచోట సిరులు (సంపదలు) నిలుస్తాయి. న్యాయమున్న చోట మాట
నిలుస్తుంది. ఆదరణ (కరుణ, కనికరం, జాలి, అనుగ్రహం, దయ) ఉన్నచోట స్నేహం ఉంటుంది.
భక్తి చేసిన ఫలమిచ్చును దైవం. మనసు స్థిరమున్నచోట సుఖముంటుంది కాని ఇతరమైన వాటిలో
వెతికితే ఎలా ఉంటుంది. దైవ కృప ఉన్నచోట గాక సర్వ జగన్నివేశ.
శౌర్యంబు
గలుగుట జన్మసాఫల్యంబు
శాంత మాత్మ
వివేక సాధనంబు
మానంబు దనకును
మహనీయ సంపద,
సిగ్గుతో
బ్రతుకు సంజీవనంబు
సవినయ వచనంబు
సర్వవశ్యకరంబు,
వెలయునాచారంబు
వెనుబలంబు
దానంబు సేయుట
తమకది దాఁచుట,
సజ్జనసంగతి
సౌఖ్యమొసఁగుఁ
గాన
బుధులీగుణంబులు మానకెపుడు,
తగిలి
మిమ్ముభజింతురు తలఁచితలఁచి
కలితలక్ష్మీశ,
సర్వజగన్నివేశ,
విమల రవికోటి
సంకశ వేంకటేశ.
3.
శరాభాంక లింగ శతకము:- ఈ శతకం 16 శతాబ్ద ఉత్తారార్థంలోనిది. శరాభాంక లింగ శతకంలో శివభక్తుల ప్రశంసతో పాటు
జనహితమైన అనేక నీతులు కూడా వివరించారు. ఈ
శతక కర్త ఎవరో స్పష్టంగా తెలియడం లేదు. క్రీ.శ. 16 శతాబ్దిలో లింగమ గుంట తిమ్మకవి
సులక్షణసారంలో శరభాంకుని చాటువుగా ఒక ఉదాహరణ కనిపిస్తుంది. దీనితో ఆ శరభాంకుడే ఈ
శతక కర్త అని, ఈ శతకం 16వ శతాబ్ది పూర్వ రచనే అని ఖండవల్లి లక్ష్మీరంజనము వారు
తెలిపారు. ఈ కవి శివభక్తుడు. ఆనాడు ప్రజల్లో వ్యాపించున్న మూఢ విశ్వాసాలను ఈ
శతకంలో హేళనపూర్వకంగా ఖండించారు.
4. భాస్కర శతకం :– సుమతీ శతకం ఎంత ప్రాచుర్యం పొందిందో అంతటి ప్రాచుర్యం పొందిన మరో నీతిశతకం భాస్కర శతకం. మారద వేంకయ్య ఈ శతక రచన చేశారు. దీనిలోని కొన్ని పద్యాలు అప్పకవీయంలో కనిపిస్తాయి. కాబట్టి ఈ శతకం 17వ శతాబ్దికి పూర్వపు రచనే అని స్పష్టమౌతుంది. ఈ శతకంలో ప్రతి పద్యంలో ఒక నీతి దానికి తగ్గినట్లు లోకంలోని దృష్టాంతం ఉదహారణగా చెప్పడం కనిపిస్తుంది. ఈ ఉదహారణలు సరసంగా ఉండి కవి లోకానుభవాని స్పష్టం చేస్తుంది. సులభశైలితో శక్తివంతమైంది ఈ శతకం.
ఉ. ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని
విద్యగా
చీరెలు నూరుటంకములు చేసెడి వైనను బెట్టె
నుండఁగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు
భాస్కరా
భాస్కరా
మంచివారు ఎవ్వరి జోలికీ పోరు. తమంత తాము ఒదిగి ఉంటారు. అయినా దుర్మార్గుడు దాన్ని
సహించకుండా వారికి కీడు చేయడమే తన విద్యగా భావిస్తాడు. అదెలాగనగా చాలా విలువైన
చీరలను పెట్టెలో పెట్టిన చిమ్మట పురుగు
చేరి చీనిగేవరుకు కొరుకుతుంది ఆ చిమ్మటకేమి లాభం. అలాగే దుర్మార్గుడు సజ్జనుణ్ణి
కారణం లేకుండా బాధిస్తాడు.
5. చంద్రశేఖర
శతకం:- ఈ శతకం
నీతి హాస్య భరితమైన శతకం. ఈ శతక కర్త ఎవరో తెలియడం లేదు. మంగళగిరి పానకాల స్వామి
జాతరలో జరుగు సామన్య ప్రజల మాటలలోని హస్య ధోరణి అనుకరించడింది. కవి ఈ శతకం అనాగరిక
సంభషణలను వారి భాషలోనే వర్ణించే విధానం నవ్వు పుట్టిస్తుంది. లోభులు, స్వార్థ పరులను
ఈ కవి తన శతకంలో ఎక్కువగా విమర్శించారు.
కలుష మనో వికారులకుఁ గష్టులకున్ కుజనాళికిన్
కుత
ర్క్యులకును ధర్మశూన్యులకుఁ గుత్సిత మానవ కోటికిన్
మదాం
ధులకును సిగ్గువుట్ట మదిదూలఁగ నే రచియింతు
నిన్ను ని
శ్చలమతిఁ జేర్చి యీశతకశాసన మిమ్ముగఁ
జంద్రశేఖరా.
6.
జగన్నాయక శతకం:-
వరాహగిరి కొండ రాజ్యమాత్యుడు రచించిన శతకం జగన్నాయక శతకం. భాస్కర శతకంలాగే ఈ
శతకంలో కూడా నీతులను వాటితో పాటు ఓ ఉదాహరణను దృష్టాంతాలు కనిపిస్తాయి. అత్యంత
సులభమైన శైలితో సరసమైనది ఈ శతకం. జగన్నాథ స్వామికి ఈ శతకం అంకితం ఇవ్వడం వల్ల ఈ
శతక కర్త విశాఖపట్నంకు చెందిన వారుగా దివాకర్ల వేంకటావదాని వారు పేర్కోన్నారు.
7.
కుక్కుటేశ్వర శతకం:-
కుచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకం రచించారు. ఈ శతకాని పిఠాపురంలోని
కుక్కుటేశ్వరస్వామికి అంకితం చేశారు.
8. రామలింగేశ
శతకం:-
అడిదం సూరకవి రచన చేశారు. ఈ రెండు శతకాలు సీస పద్యాలతో రచించారు. చక్కని నీతులు
వివరించారు. దురాత్ముల భోగలాలసతో కాలం
గడుపుతూ ధనిక, రాజుల ప్రవృత్తి ఈ శతకాల్లో ప్రధానంగా నిరశింపబడ్డాయి. సూరకవి
రామలింగేశ శతకం విజయనగర సంస్థానాధిపతి అయిన రెండవ విజయ రామరాజు చిన్నవాడు అవటంతో
రాజ్య కార్యాలను నిర్వహిస్తూన్న సీతారామరాజు దుష్టుడై బ్రాహ్మణ కవులకు విరుద్ధంగా
వ్యవహారించడం వల్ల అతనికి మంచి ఉపదేశం చేయడానికి ఈ శతకం రచన చేశారు.
9.
కుమార శతకం:– ఆధునిక
కాలంలో రచింపబడిన శతకాలు కుమార శతకం, కుమారి శతకం ఇవి కూడా ప్రసిద్ధిపోదాయి. పాఠశాల
విద్యలో ఏక్కువగా ప్రచారంలో ఉన్న ఈ శతకాలు బాలబాలికలు నేర్చుకొనే నీతులు చాల
సులభమై శైలితో వివరింపబడ్డాయి. కుమార శతకం అమ్మకోట పార్థసారధి రాశారు.
10.
కుమారి శతకం:- కుమారి
శతకం కర్త వేంకట నరసింహకవి.
11.
వేమన శతకం:-
శతకాలు ఏ ఉద్దేశంతో రచింపబడిన వాటిలో నీతులు కూడా చెప్పబడి ఉన్నాయి. ప్రసిద్ధుడైన
యోగి వేమన రచించిన విశ్వదాభిరామ వినురా వేమ అనే మకుటంతో చాల పద్యాలు నీతి
ప్రధానమైనవి ఉన్నాయి. ఆయన పద్యాలు వేలకొలది ఉన్నాయి.
ఆ.
నీళ్లలోని చేప నెఱిమాంస మాశించి
గాలమందు
జిక్కి కరణి భువిని
ఆశ
దగిలి నరుడు నాలాగె చెడిపోవు
విశ్వదాభిరామ
వినుర వేమ
ఆ. లక్ష్మి
యేలినట్టి లంకాధిపతిపురి
పిల్ల
కోతి పౌఁజు కొల్లపెట్టెఁ
జేటు
కాలమయినఁ జెఱుప నల్పులె జాలు
విశ్వదాభిరామ
వినురవేమ.
12.
భక్తృహరి నీతిశతకం:- సంస్కృత
సాహిత్యం నుండి తెలుగులోకి అనుసృజనకావించిన శతకం భక్తృహరి నీతిశతకం. ఆయన రాసిన
సుభాషిత త్రిశతిని తెలుగులో సుభాషితరత్నవళి అనే పేరుతో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు
లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు అనువదించారు. ఈ కవి 17వ శతాబ్దానికి చెందిన వాడు. ఇక్కడ
ఏనుగు లక్ష్మణకవి అనువదించిన సుభాషిత త్రిశతిలోనివి నీతిశతకంలోనివి పద్యాలు
గమనిద్దాం.
సత్యసూక్తి
ఘటించు, ధీ జడిమ మాన్చు
గౌరవ మొసంగు,
జనులకుఁగలుష మడఁచుఁ
గీర్తిఁబ్రకటించు,
చిత్తవిస్ఫూర్తిఁజేయు
సాధుసంగంబు
సకలార్థసాధనంబు.
సజ్జన సహవాసం (మంచివారితో
కలిసి ఉండడం) మంచి మాటలను మాట్లాడిస్తుంది. బుద్ధిమాంద్యాన్ని (తెలివిలేనితన్నాని)
పోగొడుతుంది. గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. జనుల పాపాలను నశింపజేస్తుంది. కీర్తిని
విస్తరింపజేస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. సజ్జనులతో సహవాసం అన్ని
కోరికలను నెరవేర్చే సాధనం.
శాం. ఆకాశంబున
నుండి శంభునిశిరం, బందుండి శీతాద్రి సు
శ్లోకంబైనహిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి
య
స్తోకాంభోధి
పయోధినుండి, పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు
వివేకభ్రష్టసంపాతముల్.
గంగాప్రవాహం
ఆకాశం నుండి శివుని తలపైకి, అక్కడనుండి హిమవత్పర్వతం పైకి, గొప్పగా కీర్తించబడే
స్వచ్ఛమైన హిమాలయాలపై నుండి భూమిపైకి, భూలోకం నుండి సముద్రంలోకి, సముద్రంలో నుండి
పాతాళలోకానికి చేరింది. అలాగే బుద్ధిహీనులైన వారు కూడా ఉన్నతోన్నత స్థానం నుండి
అనేకవిధాలుగా దిగజారుతూ అధోగతి పాలవుతారు.
చ. తెలివి
యొకింత లేనియెడ దృప్తుఁడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁ
దొల్లి యిప్పుడు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాఁడనై మెలఁగితిం గతమయ్యె
నితాంతగర్వమున్.
పూర్వం నేను
కొద్దిపాటి జ్ఞానంకూడా లేనప్పుడు సర్వస్వము తెలిసిన సర్వజ్ఞుడనని ఏనుగువలె గర్వంతో
విర్రవీగాను. కానీ మహాజ్ఞానులైన పండితుల వద్ద ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని నేను
పూర్వం ఎంత తెలివిలేని మూర్ఖునిగా మెలిగానో తెలుసుకున్నాను. అంతులేని నా గర్వం
తొలగిపోయింది.
ముగింపు-
దుర్గుణాలను ఏ సజ్జనుడు హర్షించడు. మానవడు
నైతిక విలువలతో ఈ దురాత్ముల నుండి తమను వేరుగా ప్రత్యేకంగా చూపడానికి,
జీవించడానికి ఈ నీతి శతకాలు పఠనీయం. మనిషి మనుగడ కోసం మార్పును అన్వేషిస్తే, మనిషికి మానవత్వ విలువలను బోధించినవి ఈ శతకాలు.
ఎటువంటి సందర్భంలోనైన మనిషి సజ్జన స్వభావం వీడకుండా ఉండడానికి, మరియు వారి జీవితం
ఫలవంతంగా ఉండటానికి ఈ శతకాలు మార్గదర్శకాలు, ఆదర్శప్రాయాలు. ప్రతి విద్యావంతుడు
తప్పనిసరిగా ఈ నీతి సూక్తులు పాటిస్తు వారి కీర్తి సముద్రాని విస్తరింప
చేసుకోగలరు.
ఉపయుక్తగ్రంథ
సూచి :-
1. 1.ఆంధ్ర వాగ్మయ చరిత్ర- డా. దివాకర్ల వేంకటావదాని
2. 2.చంద్రశేఖరశతకము – పరిష్కర్త-
మున్నంగి...శర్మ
3. 3.సుభాషితరత్నాలు( తెలుగులో సుప్రసిద్ధ శతకపద్యాలు- సుభాతాలు తాత్పర్య సహితంగా)-సంకలనం-వివరణ- డా. నొస్సం నరసింహాచార్య- ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం ,తి.తి.దే.
ఈ వ్యాసం తెలుగు శాఖ, ఫ్యాకల్టి ఆఫ్ ఆర్ట్స్ , కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి -221005. వారు జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్ నేషనల్ వెబ్నార్ లో సమర్పించిన పరిశోధక పత్రం. అప్పటికి డాక్టరేట్ పట్టా అవార్డ్ కాలేదు. ఈ సదస్సును మా గురువుగారు ఆచార్య చల్లా శ్రీరామ చంద్రమూర్తి గారు నిర్వహించారు.
చాలా చక్కగా చదవదగిన శతకములను రాసి ఆలోచింప చేస్తున్నావు.
రిప్లయితొలగించండిపలు విధములైన మంచి శశతకములను రాసి మా ముందుంచిన రీతిని బట్టి మేము బహు సంతోషించుచున్నాను. ఇటువంటివి మరెన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను.