వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ

 

వచన కవిత్వంలో రైతుల ఆత్మావిష్కరణ

డాక్టర్. పోలా బాలగణేశ్

టి.జి.టి. తెలుగు  ఉపాధ్యాయులు,

గేస్ట్ ఫ్యాకల్టి,

ఏకలవ్య ఆదర్శ ఆవాశ పాఠశాల,

బుట్టాయిగూడెం,

ఏలూరు జిల్లా-532502

ఉపోద్ఘాతం         

        భారతీయ ఇతిహాసంలో రైతుల ప్రస్థానం గమనించినట్లైతే మొదట చాతువర్ణ వ్యవస్థలో వైశ్యులు వ్యవసాయం చేయడం గమనిస్తాము. తర్వాత కాలప్రవాహంలో ఈ వ్యవసాయం శూద్రులకు సంక్రమించింది. నేడు వ్యవసాయం చేయని, రాని వర్గం లేదు. నాగరికతకు పునాది వేసింది వ్యవసాయం అంటే అతిశయోక్తి కాదు. అటువంటి రైతు పరిస్థితి నేటికి అస్థవ్యస్థంగా ఉంది. రైతుల పట్ల నిరాధరణ పరిస్థితులు పెరుగిపోతున్నాయి. అందులో ఓటుబ్యాంకు రాజకీయాలు కారణంగా పార్టీ రైతులు తప్ప పూర్తి రైతాంగం ప్రభుత్వ సదుపాయాలు పొందడం లేదు. వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవ సృష్టి చేసే కళ అదొక్కటే చరిత్రలో మొట మొదటి మౌళిక కళాకారుడు రైతే. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యింది కూడా రైతే అని పాపినేని శివశంకర్ గారు రైతు కవితా వికాసం అనే వ్యాసంలో పేర్కోన్నారు. ఈ మాటలు అక్షరసత్యాలు. నేటికీ రైతు వంచనకు గురౌతున్నాడు.

                   మన దేశంలో ఆంగ్లేయుల పాలన ప్రారంభమైన తర్వాత భూమిశిస్తూ పైనే అధిక దృష్టిని కేంద్రికరించారు. ఆంగ్లేయులు చివరికి అటవి ప్రాంతంలో జీవన పోషణార్థం పండించుకున్నే పంటభూములను కూడా వదిలి పెట్టలేదు. గిరిజన రైతులపై కూడా పన్నులు వసూలు చేయడానికి యత్నించారు. ఈ సందర్భంలో 1885-56 మధ్య కాలంలో సంతాల్ (బీహార్) గిరిజన రైతులు ఆంగ్లేయులపై పోరాటం చేశారు. వీరి పరిపాలన కాలంలో గిరిజన రైతాంగం 75 సార్లు పోరాటం జరిపింది. నేడు రైతాంగంకు వ్యతిరేకంగా, వ్యవసాయరంగంకు నష్టదాయకంగా ప్రభూత్వాలు పనిచేస్తున్నాయి.

                 భారతీయ ఆత్మ గ్రామాలలో ఉంది అని మహాత్మ గాంధీజీ చెప్పాడు. గ్రామాల స్వయం సమృద్ధే దేశాభివృద్ధి అని, గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయంకు, చేత్తి వృత్తులకు, చేనేత కుటీర పరిశ్రమలకు నిలయాలుగా మార్చాలని కలలు కన్నాడు. వారి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ,  ప్రభుత్వాలు నడుపుతూ వ్యవసాయం, ఫలసాయం అన్నింటిని ప్రైవేటుపరం చేస్తూ పార్లమెంటులో చట్టాలు తేస్తున్న వైనం గమనిస్తూనే ఉన్నాము. చలిలో వర్షంలో రైతులు నిరసనలు చేసిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరికి రైతుల వజ్రసంకల్పంతో, రాజకీయ లాభనష్టాల తూకంలో తూచబడి ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకుంది. ఇటువంటి పరిస్థితులను నేటి రైతాంగం, వ్యవసాయరంగం ఏదుర్కోంటుంది.  1980-2000 మధ్య కాలంలో వచ్చిన వచన కవిత్వం ద్వారా  రైతుల పట్ల కవులు స్పందించిన తీరు ఉద్విగ్నుల్ని చేస్తుంది, కళ్లు చెమర్చేలా చేస్తుంది, ఉద్యమింపచేస్తుంది. కవే రైతై ఆలపించిన ఆత్మఘోషై వినిపిస్తుంది.

           అభ్యుదయ కవిత్వోద్యమంలో భాగంగా వచన కవిత్వం విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. వచన కవిత ద్వారా సమస్త వస్తువులతో వచన కవిత్వీకరణ జరిగింది. ఆధునిక లక్షణాలతో రూప పరిణామంలో ఛందపద్యాలకు అతీతంగా గేయం నుండి వచన కవిత్వం అనే రూపం పొందింది. శిష్ట్లా పఠాభి శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, తిలక్, కుందుర్తి, ఆవంత్స సోమసుందర్ వంటి కవుల నుండి నేటి కవుల వరకు వారి చేతుల నుండి అక్షరముత్యాల వంటి వచన కవితలు వినూత్న కవితా వస్తువులతో, నవ్యాభివ్యక్తీకరణతో మనముందుకు వస్తునే ఉన్నాయి.

ప్రపంచీకరణ - రైతు              

                                    తెలుగు సాహిత్యంలో రైతుల శ్రమైక జీవన సౌందర్యం, రైతుల వ్యధలు, నీరు లేని పల్లెసీమల దుస్థితిని వర్ణించిన వివిధ పద్యకావ్యాలు, కథలు, నవలలు అనేకం వచ్చాయి. అవన్ని  స్వాతంత్రం రాక, వచ్చిన కొద్ది సంవత్సరంలో ప్రచురించిన రచనలు. అయితే రైతుల జీవన సరళీ నూతన ఆర్థిక విధానాలు అమలుతో ఘననీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.  నూతన ఆర్థిక విధానం-1991, ప్రపంచీకరణ, ప్రపంచబ్యాంకు ఆధిపత్యం, వ్యవసాయ రంగం ప్రాధాన్యత కోల్పోయి పారిశ్రామిక రంగం, సేవల రంగం అది కూడా ఐ.టి. కమ్యూనికేషన్ రంగం వైపు భారతదేశం ప్రయాణం మొదలు పెట్టింది. దేశ ఆర్థిక విధానాలు త్వరితగతిన మారిపోవటం, పట్టణీకరణ, పల్లెసీమలో పరిశ్రమల స్థాపన, వ్యవసాయ భూములను సెజ్ ల పేరిట ప్రైవేటు పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టడం, వర్షాలు లేకపోడం, కరువు సంభవించడం, పెరిగిన ధరలు వంటివి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులు కారణంగా బక్కచిక్కిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడారు.  దాదాపు నేటికి ఇటువంటి సమస్యలతోనే రైతులు ఆత్మహత్యలకు పాలవుతున్నారు.

               కమతాలు చిన్నవికావడం దిగుబడి  లేకపోవడం, రుణభారం పెరిగిపోవడం, వ్యవసాయ పెట్టబడి పెరిగిపోవడం, కల్తీవిత్తనాలు, ఎరువులు వంటివి రైతులను ఆందోళనకు గురిచేసి ప్రాణాలను పోట్టన పెట్టుకున్నాయి. ప్రభుత్వాలు రైతు సమస్యలకు వివిధ పరిష్కార మార్గాలను వివిధ పథకాల రూపేన చూపిన, రైతులకు మాత్రం అరకొరగానే సమస్యలు తీరుతున్నాయి. ఒకవేళ సమస్యల పరిష్కారమైనా రైతులందరికి ఆ పథకాలు లభించడం లేదు. తద్వారా రైతులు ఆత్మహాత్యలకు పాల్పడారు. నలుగురికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నల పుట్టెడు దుఃఖాన్ని తీర్చలేని పరిస్థితి ఏర్పడింది.

              ఈ పరిస్థతులను ఏదుర్కోంటున్న  రైతుల జీవన శైలిని సమకాలీన ఆధునిక కవులు తమ కవిత్వ రచన ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో రైతుల ఆత్మసాక్షాత్కారం, వారి దయనీయ పరిస్థితిని, రైతుల జీవితావిష్కరణను కవులు తమ కవితా వస్తువులుగా మలిచి రైతుల వాస్తవిక పరిస్థితిని తెలుగు సాహిత్య చరిత్రలో నిక్షిప్తం చేశారు.

సాహిత్యంలో రైతు     

                         ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు తమ కవిత్వంలో కర్షకులను(రైతులను) స్ఫృశించని, స్మరించని కవులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయా సాహిత్య కాలాలలో వచ్చిన కావ్యాలలో, రచనలలో రైతుల ప్రస్తావన కనిపిస్తుంది. గాథాసప్తశతిలో పండిన పంటను చూచి రైతు ఆనందంతో పండు వెన్నెలలో పాడుకున్నట్లు వర్ణించింది. ఆది కవి నన్నయ తన ఆంధ్రమహాభారతంలో రైతులకు ధాన్యం, విత్తన్నాలను, రైతులకు, వ్యాపారులకు రుణాలను రాజు సమయానికి అందించాలి అని వర్ణించాడు.

క. హీనులగు కర్షకులను

    భూనుత ధ్యానంబు బీజములు, వణిజులకున్

    మానుగ శతైకవృద్ధి న

    నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్. – ఆంధ్రమహాభారతం సభాపర్వం- 4-22 

 

         ఇక తిక్కనగారి భారతంలో కర్షక, వ్యాపారుల నుండి పన్నులను పులి తన కూనలను తిన్నట్టుగా కాకుండా జలగ దిగిచినట్లు నొప్పి లేకుండా వసూలు చేయాలని ధర్మరాజుకు భీష్ముడు అంపశయ్య పై నుండి రాజనీతిని బోధించినట్లు శాంతిపర్వం ద్వితీయాశ్వాసం 393వ పద్యంలో కనిపిస్తుంది.

 

             తెలుగు ప్రాచీన కావ్యాలలో రైతు ప్రస్తావన కనిపిస్తుంది.  ప్రబంధ యుగంలో రాయలు వారు ధుర్జటీ, తెనాలి రామకృష్ణుడు వంటి వారు రైతుల వ్యవసాయ కృషిని అలాగే వారి పని పాటలను భోజన విహారాలను ప్రస్తావించారు. రాయలు పరిపాలించిన రాయల సీమలో నీటి కరువుతో ఉండింది. దానితో రాయలు వారు నీటి చెరువులను త్రవించి వ్యవసాయం అభివృద్ధి చేశారు. ఏరువకా కాలంలో రైతులు అందరూ తమ పశువులను నాగళ్ళకు కట్టి భూములను దున్నేవారు. ఆ గ్రామంలోని ఏ దున్ననను, ఎద్దును వదలకుండా భూములను దున్నించే వారని శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ప్రబంధంలోని ఈ క్రింది పద్యం తెలియజేస్తుంది.

‘‘కాలుని నందిదున్ననయి గంటలు దున్నక మంటి, నా మహా

 కాలుని నందిదున్ననయి కర్దమ మగ్నత లేకమంటి నా

 హాలికు లెన్నడుందెగని యౌరుల చేలును జౌకుమళ్ళు నుం

 గా లలి నేరుసాగి రిలగల్గు పసింగొని పేద మున్నుగన్‌’’.

 

          ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో నత్కీరుని కథలో ఆనాడు వర్షాలు లేక రైతులు ప్రజలు పడిన బాధలను వర్ణించాడు. రాయలసీమ కరువును స్వయంగా చవిచూసినందున, నీటి కరువు యొక్క ప్రభావం ప్రజల జీవనంలో ప్రభలమైన మార్పులను తీసుకువచ్చిందని, ఆహారంలో వివిధ ఆకుకూరలను వినియోగించుకొని తమ ఆకలి తీర్చుకున్నారని ధూర్జటి తెలియజేశారు.  

              ఆధునిక పద్యకావ్యాలు రచించిన కవులు రైతుల జీవితాని, వ్యవసాయ రంగం గొప్పదనాన్ని, వ్యవసాయ రంగంలోని సమస్యలను చిత్రించారు. ఆ విధంగా రైతుల పై వచ్చిన పద్యకావ్యాలను గమనిస్తే దువ్వూరి రామిరెడ్డి-కృషీవలుడు, వేటూరి వెంకట నరసయ్య –క్షేత్రలక్ష్మి, అమ్మిశేట్టి లక్ష్మయ్య- రైతు కళ్యాణము, కన్నెకంటి వీరభద్రాచార్యులు- పేదకాపు, వానమామలై జగన్నాథాచార్యులు- రైతు రామాయణం, బైరపు రెడ్డి నారాయణరెడ్డి- రాయలసీమ రైతు, గుఱ్ఱం జాషువా- నాగార్జున సాగరు వంటివి. ఈ పద్యకావ్యాల ద్వారా ప్రాచీన తెలుగు సాహిత్య కవులు కన్న  ఆధునిక పద్య కవులు రైతులపై అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతుల మేలు కోరకు అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపు కోరకు కృషి చేశారు. దీనికి ఈ ఉదాహరణ గమనిస్తే మనకు స్పష్టమవుతుంది.

తె. సైరికా, నీవు భారతక్ష్మాతలాత్మ

    గౌరవ పవిత్రమూర్తివి శూరమణివి

   ధారుణీపతి పాలనదండ మెపుడు

   నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె

అంటు దువ్వూరి రామిరెడ్డిగారు రైతు యొక్క గొప్పదనాని చెప్పుతూ ఓ రైతు సోదరుడా భారతదేశ ఆత్మగౌరవాన్మి ప్రకటించే పవిత్ర రూపానివి.  శూరులలో శ్రేష్ఠుడివి, రాజు చేతిలోని ధర్మదండం కన్నా నీచేతిలోని నాగలి గొప్పది. రాజదండంలో దండించే గుణం ఉంటే నీ చేతిలో నాగలి పండించే గుణం కలిగి ప్రజల పశుపక్ష్యాదుల  ఆకలిని తీరుస్తుందని, రైతుల నిస్వార్థ శ్రమతో, పవిత్రమైన పరోపకార బుద్ధిని కలిగిన రైతు చేతిలోని నాగలి ప్రార్థనీయమైనది అని రామిరెడ్డిగారు తెలియజేశారు.  

తె. జీవనస్పర్ధ సామాన్య చేష్టయైన

    కాలమున వ్యక్తివాద మగ్రత వహించు

    సత్త్వవిరహితు డన్యభోజ్యత నశించు

    నర్హజీవియె యంతరాయముల దాటు

    కాన జీవనసంగ్రామ కార్యమందు

    విజయి వగుటకు శౌర్యంబు, విద్య, బుద్ధి,

    సత్యసంధత, యాత్మవిశ్వాస మనెడు

    నాయుధంబుల విడవకు హలికవర్య

         అంటు రైతులకు ఏన్ని సమస్యలునా వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోని ప్రయత్నంతో ముందుకు సాగాలి అని రైతులకు ప్రబోధింస్తారు రామిరెడ్డిగారు.

 పై తెలిపిన వివిధ పద్యకావ్యాల ద్వారా కర్షకున జీవన చిత్రణను చిత్రించారు కవులు. అంతే కాకుండా తెలుగు సాహిత్యంలో బాగా వ్యాప్తిలోకి వచ్చిన వచన కవితా ప్రక్రియలో కూడా వివిధ కవులు తమ  కవితల ద్వారా రైతుల ఆత్మావిష్కరణను అభివ్యక్తీకరించారు.  

           యుగ పురుషునిగా కీర్తీగాంచి ఆధునిక కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటిలో ప్రతిజ్ఞ అనే కవితలో రైతుల యొక్క శారీరక కష్టానికి ఖరీదు లేదని శ్లాఘించాడు.

పొలాల నన్నీ,

హలాల దున్నీ,

ఇలాతలంలో హేమం పిండగ-

జగానికంతా  సౌఖ్యం నిండగ-

విరామ మెరుగక పరిశ్రమించే,

బలం ధరిత్రికి బలి కావించే,

కర్షక వీరుల కాయం నిండా

కాలువకట్టే ఘర్మజలానికి,

ఘర్మ జలానకి,

ధర్మజలానికి,

ఘర్మజలానికి ఖరీదు లేదోయ్! – (మహాప్రస్థానం-పుట-60)

       అంటు  కర్షకుల గురించి వర్ణిస్తూ వారు పడే కష్టంతో భూమిని బంగారంగా చేస్తూన్నారని, ఈ లోకానికి అన్నం పెడుతున్నవారుగా, మనకు సౌఖం కలుగజేస్తున్నవారుగా  శ్రీశ్రీ రైతులను కీర్తించాడు. వారి శరీర బలాని అంతా భూమికి బలిగా ఇస్తూ విశ్రాంతి లేకుండా, నిత్యం పొలంలో పని చేస్తూన్న రైతుల కష్టానికి ఖరీదు లేదని చాటిచేప్పాడు. శ్రీశ్రీ వారి శ్రమకు నిదర్శనం అయిన ఘర్మజలానికి (చెమటకు) ఈ లోకంలో  ఖరీదు లేదని(తూచలేనిది, కొలువరానిది, పోల్చలేనిది) ఖరీదు కట్టే షరాబు లేడని స్పష్టం చేశారు. 

తరువాయి భాగం త్వరలో....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

77వ స్వాతంత్ర్య దినోత్సం

గురజాడ వెంకట అప్పారావు కవిత్వం - మానవత్వం