“తిలక్ వ్యక్తిత్వము- ఆత్మీయత” వ్యాస కర్త :- డా. టి. రాజేశ్వరి గారు, లైబ్రేరియన్ (రిటైర్డ్), తెలుగు శాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి.
డా. టి. రాజేశ్వరి మేడమ్ గారు కాశీ హిందూ విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం లో ఆచార్య శ్రీ గుంటూరు త్రివిక్రమయ్య గారి పర్యవేక్షణలో భావ అభ్యుదయ కవి బాల గంగాధర తిలక్ అనే సిద్ధాంత గ్రంథం సమర్పించి డాక్టరేట్ పట్టా పోందారు. వారు ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ గ్రంథాలయం అధికారిగా విధులు నిర్వహించారు. నేను 2011-2013 ఏమ్.ఏ తెలుగు చదువుతున్నపుడు వారిని తెలుసుకున్న. వారి నిర్వహణలో గ్రంథాలయం నడిచింది. తెలుగు నేల పై నుండి అక్కడికి చదుకోవడానికి వెళ్లిన మాపై వారు (పి.బాలగణేశ్, జే. శ్రీకాంత్, ఆర్. రాజేశ్, ఇ. కీర్తి, ఎన్.సునీత) ఏంతో ఆప్యాయత చూపారు. వినాయక చవితి, ఉగాది పండగలకు మమల్ని పిలిచి ఆదరించేవారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. వారు భారతి వంటి పత్రికలు ఉన్న, ఏన్నో ఉత్తమైన అతి విలువైన పుస్తకభాండారం, విజ్ఞాన ఖనిని విజయవంతంగా నడిపారు జ్ఞాన సమపార్జనలో మములను ప్రోత్సహించారు.
నేను పరిశోధనలో అడుగు పెట్టినప్పుడు నాకు వచన కవిత్వం రాసిన తిలక్ గారి గురించి చేప్పారు. అయితే నా అంశం "వచన కవిత్వము-అభివ్యక్తీకరణ 1990 నుండి 2001 వరకు" గల కాలం ప్రధానం కావడంతో వారి పరిశోధక గ్రంథం పుర్తిగా చదివే అవకాశం కలుగలేదు. ఇదే విశ్వవిద్యాలయంలో వారి భర్తగారు రసాయణ శాస్త్రంలో ఆచార్యులు (Professor, Department of Chemistry, institution of Science-B.H.U, Varanasi.). మేడమ్ గారు (భర్త) సార్ ఇద్దరు 2018లో రిటైర్డ్ అయ్యారు. నేను పరిశోధన చేస్తున్నప్పుడు మేడమ్ గారు వ్రాసిన ఒక వ్యాసం ఇచ్చారు. మరి వారు ఏ సాహిత్య పత్రికకు పంపారో తెలిదు. అది వారు పరిశోధన చేస్తూన్నప్పుడు వ్రాసినది ఆ కాగితాలు జీర్ణావస్థకు చేరుకున్నాయి. ఆ వ్యాసం ఈ బ్లాగ్ లో నిక్షీప్తం చేయడం వల్ల ఇది ఎల్లకాలం మనుగడలో ఉంటుంది. వారి గుర్తుగా నిలుస్తుంది. ఆ వ్యాసం పేరు “తిలక్ వ్యక్తిత్వము- ఆత్మీయత” - వ్యాస కర్త డా. టి. రాజేశ్వరి గారు, లైబ్రేరియన్, తెలుగు శాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి.
Prof .T.R.Rao sir Dr. Rajeswari Madam
B.H.U., Varanasi.
“తిలక్ వ్యక్తిత్వము- ఆత్మీయత”
వ్యాస కర్త :- డా. టి. రాజేశ్వరి గారు, లైబ్రేరియన్ (రిటైర్డ్),
తెలుగు శాఖ, కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి.
ఆధునిక కవులలో లబ్దప్రతిష్టులైన కొద్దిమందిలో దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రముఖులు. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు దగ్గర మండపాక గ్రామంలో ఆగస్టు 1, 1921 వ సం.లో జన్మించారు. ఇతని కాలవ్యవధి చాల తక్కువ అయిననూ ఇతను వ్రాయని కవితలు చేయని ప్రయోగాలు లేవు. తక్కువ సమయంలో అనంతంగా సాహితీక్షేత్రాన కావ్య వ్యవసాయం చేసిన కృషీవలుడు. భావకవిత్వం ప్రజాకవిత్వం, ప్రాచీన కవిత్వం వీటన్నింటితోను తిలక్ ప్రభావితుడయ్యాడు. తిలక్ తానే చెప్పుకున్నట్లు..
"ఆనందం మనిషైన వాడు
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించిన వాడు
జీవితాన్ని ప్రేమించిన వాడు
జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద
ఉదయించిన సూర్యుని లాంటి వాడు
జీవితాన్ని హసన్మందార మాలగా ధరించిన
వాడు."(అమృతం కురిసిన రాత్రి)
ఇతను మంచి
స్నేహశీలి. స్నేహితులను ఎప్పుడూ మందస్మిత వదనంతో పలకరిస్తూ ఉండేవాడు. ఇతని పద్యాలు
కూడా ఇతనిలాగే ఇజాలు, రాజకీయాలూ, వాదాలు,
యుద్ధాలు, హత్యలు ఇంకా ఇటువంటి చెత్తచెదారం మనసులో పేరుకోక ముందు రాసినట్లు ముగ్ధ
మోహనంగా ఉంటాయి. తిలక్ నిరాడంబరంగా తన జీవితాన్ని గడిపాడు. నిజాయితీ, నైర్మల్యం,
సహృదయులూ, విశిష్టమైన వ్యక్తిత్వం తిలక్ గుణాలుగా కన్పిస్తాయి.
ఆంతరంగికంగా
చూస్తే తిలక్ వ్యక్తిత్వం చాల బలమైనది. ఆయన ముద్ర ప్రతి అక్షరంలోనూ మనకు
కన్పిస్తుంది. ఆయన భావనలన్నీ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలుగా కన్పిస్తాయి. ఇతని
అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నా కవిత్వం కాదోక తత్త్వం అనే వాక్యంతో
ప్రారంభమౌతుంది. అంటే ఇతని కవిత్వం అన్ని తత్త్వాలను తాకుతుంది, కాని ఏతత్త్వానికి
నిలబడదు అంటే ఏ సిద్ధాంతము పట్టనివాడు కాడు. ఏ సిద్ధాంతానికి తాను కట్టుబడనని
స్పష్టంగా చెప్పటం ద్వారా అతని వ్యక్తిత్వం ఎంత బలమైనదో అర్థమౌతుంది.
తిలక్ లో కవితపాలు ఎక్కువ చిక్కన.
అందుకనే చదవగానే గుండెను రెపరెపలాడిస్తుంది. ఇతని భావన ఉహకందనంత పదునైనది కావడమే
దానికి కారణం. కవులందరూ ఆలోచనల నుంచి అనుభూతిని పిండుకుంటే తిలక్ అనుభూతి నుంచి
ఆలోచిస్తాడు.
"నేను చూసాను నిజంగా ఆకలితో అల్లాడి
మర్రి చెట్టుక్రింద మరణించిన ముసలి వాణ్ణి"
అంటూ క్షత
జగత్తును చూచి కరిగి పోతాడు.
ఇతను
ప్రేమగీతం వ్రాసినా, పద్యం వ్రాసినా శైలి
మారదు. అదే అతని వ్యక్తిత్వం. అగ్ని జల్లిన్నా, అమృతం కురిసినా అందం, ఆనందం దాని
పరమావధి. ఎవరూ పట్టించుకోని రహస్యాల్ని వశపరుచుకోవడం తిలక్ లో ఒక ప్రత్యేకత.
పరిశీలనలోనూ, దాని వినియోగంలోనూ రచయిత బాధ్యత పెద్దది. అందంగా చెప్పడమనేది భావుకత
చేసే పని. ఈ రెండింటిలోనూ తిలక్ సిద్ధహస్తూడు. తిలక్ లో చక్కని భావనవ్యత
కన్పిస్తుంది.
"జలజల మని కురిసింది వాన
జాల్వారింది అమృతంపు సోన"
అన్న భావన
ఎంతో మధురమైనది అమృతంపు సోన దోసిళ్ళతో పట్టి త్రాగితే దుఃఖాలూ, చావూ తొలగిపోతాయన్న శుభాశంసన ఇందులో కన్పడుతుంది.
తిలక్ వచన కవితా యుగ కర్తగా, సమన్వయ కవిగా,
అభ్యుదయ భావాలున్న భావకవిగా, సకల జగన్మిత్రుడైన ప్రజాకవిగా వర్ణించవచ్చు. భావకవితా
యుగంలోని మనిషిని, అభ్యుదయ యుగంలోని మనిషిని కాకుండా ఆధునిక కాలానికి చెందిన వివిధ
సమస్యలకూ, అశాంతికి అంకితమైన సగటు మనిషిని గురించి ఆలోచించడంలోనే తిలక్ నవీన
దృక్పథం, వ్యక్తిత్వం కన్పిస్తాయి.
ఇతని
ప్రక్రియా వైవిధ్యాన్ని పరిశీలిస్తే సంప్రదాయకమైన పద్యాలు వ్రాశాడు. సంప్రదాయక
పద్యాలలో కూడ ఎంతో ఆధునికత కన్పిస్తుంది. వచన గేయాలు వ్రాశాడు వీటన్నింటిలోను
తిలక్ ను విశిష్టమైన కవిగా గుర్తింపజేసిన ప్రక్రియ వచన కవిత్వం. నేనుకాని నేను లో
"నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు
నలుగుర్నీ మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు."
అంటూ
నలుగుర్నీ మంచి చేసికోవడం కోసం వాళ్ళు చెప్పినట్లు వ్రాయనని, తనకి వివాదాలంటే
గిట్టవని చెప్పడంతో అతని వ్యక్తిత్వం ఎంత గోప్పదో అర్థంమౌతుంది. ఈ ఖండికలో తిలక్
తాను ఏకాంతంగా వ్రాసుకునే తీరును చక్కగా చెబుతాడు.
"ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని
రాసుకుంటుంటాను
నా హృదయ స్పందనమాత్రం నాకు వినిపిస్తూ
వుంటుంది
ఆకాశం నక్షత్రాల్ని జారవిడిచి అంత యెత్తుకు
యెగిరిపోయింది
నా చుట్టూవున్న తెరలు జారిపోయాయి నాకు నిజంగా
మెలకువ వచ్చింది"
తిలక్ లో మంచి
స్వేచ్ఛాప్రియత్వం కన్పిస్తుంది. మనసులో పోరలు, తలుపులు, దాపరికాలు, కంతలోంచి
చూడడాలు లేకపోవడమే ఇతని మానసిక స్వేచ్ఛలోని విశేషం. ఇటువంటి మానసిక స్వేచ్ఛ
అందరికీ సాధ్యపడదు. ఎటువంటి నిషేధాలు లేకుండా జీవితాన్ని సమగ్రంగా సంపూర్ణంగా
చూసి, అనుభవించి దాన్ని వ్రాతలో రూపోందిచడానికి నిజాయితీ అవసరం. తాను తెలుసుకొని
నమ్మిన దాన్ని గురించి వ్రాయాలన్న తృష్ణ, మానసిక స్వేచ్ఛ నిజాయితీ గల వారికే
వీలవుతాయి. తిలక్ లో ఈ రకం వ్యక్తిత్వం మనకి కన్పిస్తుంది. అందుకే కవివాక్కు అనే
కవితలో
"వంచలేను శిరస్సు ఏ అధికారం ముందు
ఒప్పలేను మానసిక దాస్యాన్ని ఏ ప్రభుతయందు"
అంటూ ఏ
ఉద్యమానికి ఏ తత్వానికి లొంగక మానసిక స్వేచ్ఛని, గిరుల నడుమ బిగించక జీవితాన్ని
అవలోకించడం తిలక్ లో కన్పిస్తుంది. ఒక సిద్ధాంతాన్ని, ఆదర్శాన్ని ప్రచారం చేయాలన్న
ఉబలాటం ఇతనిలో కన్పించదు. ఇతని రచనలో ఒక క్రొత్తదనం, చురుకుదనం, స్పష్టత
గోచరమౌతాయి. పరిపక్వత, నిండుతనం ఒక విధమైన హుందాతనం ఈయన రచనలో కన్పిస్తాయి. అందుకే
నాకు మీ రంగురంగుల కాగితపు బురఖాలు అక్కరలేదు అంటాడు. (కవివాక్కు) నాకాదర్శాలు
లేవు అనడంలో నేను నాలాగే ఉంటాను గాంధీ, నెహ్రులు మొదలైన ఆదర్శవాదుల లాగ
ఎందుకుండాలి నా వ్యక్తిత్వం నాది అన్న
దృక్పథం కన్పిస్తుంది. జీవితం ముళ్ళ కంచెల మధ్య, బురద గుంటల మధ్య నిజం కోసం
పరిశోధిస్తూ ఉంటాను అంటాడు.
తిలక్ సాంప్రదాయిక భారతీయ తత్త్వ చింతనలోని
మూఢత్వాన్ని తిరస్కరించినా మొత్తం మీద అది ఉత్కృష్టమైనదే అన్న భావన కలవాడు. ప్రాచీన
ఆర్వాచీన కాలాల్లోని విజ్ఞానంలోని మంచి నుపయోగించుకుంటూ సాగిపోవాలని చెబుతాడు.
ఇజమే అనే ఇంప్రిజన్ లో ప్రవేశిస్తే ఇంగితజ్ఞానం నశిస్తుంది అన్న తిలక్ ఎంత
స్వచ్ఛమైన మనస్సుకల వాడో మన కవగత మవుతుంది. నేనంటే నాకే అసహ్యం అని పలకడంలో ఇతనికి
గల ఆత్మవిమర్శ ఏపాటిదో మనకు విశిదమౌతుంది. అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ
త్రాగుతాను అంటాడు. మనిషిలో ఉండే లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తగినంత త్రాగితే,
చంపితే అది మనిషిలోని బలహీనతను తెలియచేస్తుంది. ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు
అనడంలో ఏమీ పట్టని తన వ్యక్తిత్వం ఏమిటో ఇక్కడ కవి సైనికుని ద్వారా
తెలియజేస్తున్నాడు. సమాజంలో తానూ ఒక వ్యక్తియే గనుక, పరులను నిందించడం గాక
ఆత్మనిందనే చేసికుంటాడు.
మన సంస్కృతి
గురించి ఇతనికి చాల విశాలమైన దృక్పథం ఉన్నది. కేవలం కాళిదాసూ, శంకరుడూ, మహాత్ములకే
వారసుణ్ణనుకో లేదు. విలియం షేక్‌స్పియర్,
పికాసోలకు కూడా వారసుడిననుకున్నాడు.
అందుకే అంటాడు
"మన సంస్కృతి నశించిపోతుందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది
ఆధారం
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ
అమ్మాయి ఎంత పోరినా పేట్టుకోదు అంటాడు
మనగలిగినదీ, కాలానికి నిలబడగలనదీ వద్దన్నాపోదు
మనదైనా మరోకరిదైన మంచికి జాతి, కులమూ
సరిహద్దులు
లేవు అన్న ఉత్తమ ధృక్పథమాయనది.
యుగయుగానికి స్వభావం మారుతుంది.
అగుపించని ప్రభావానికి లొంగుతుంది.
అంతా మాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్లు
ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి
జంకకు"
సిద్ధంగా ఉండు
అంటాడు. కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికే తెలుసు. అది కాళిదాసు, పెద్దన్న,
శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవులకే తెలుసునని అంటాడు. కాళిదాసు కవితలోని మాధుర్యం,
సౌందర్యం ఎవడు పోగోట్టుకుంటాడు.
"ఎటొచ్చీ విధవలకీ వ్యాకరణానికీ
మను
శిక్షాస్మృతికి గౌరవం లేదని వీరికి లోపల దిగులు"
అని
సంప్రదాయభీరువుల్ని తిరస్కరిస్తూ
వర్తమానా వర్త
ఝంఝా వీచికలకి కాళ్ళు తేలిపోయే పెద్దన్నలు పాత్రనే పట్టుకు వేళ్ళాడాతారు కాని
పాతలోని మంచిని పోగొట్టుకునే బుద్ధిహీనుడెవడు అంటాడు.
ముగింపు
'తిలక్ ఖచ్చితమైన మానవతావాది. కేవలం
వ్యక్తిగతమైన అనుభూతికి సంబంధించిన మానవతా భావనకు, సమాజపరమైన మానవ కారుణ్య భావనకు
చాల తేడా ఉంటుంది. తిలక్ నిశ్చయంగా యీ రెండవ పద్ధతికి చెందినవాడే. అభ్యుదయ కవితా యుగపు
ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావనా, అకుంఠిత మానవీయ పతాకను ఎగురువేసే తత్వమూగల
అభ్యుదయ కవికంఠమతనిది.' (అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి మావాడు –మహ గట్టివాడు
-కుందుర్తి ముందు మాట)
"నా
అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే
విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన
ఆడపిల్లలు."
నా కవిత్వం – దేవరకొండ
బాలగంగాధర తిలక్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి